దానికి మర్యమ్ కుమారుడు ఈసా (ఏసు): "ఓ అల్లాహ్! మా ప్రభూ! ఆకాశం నుండి ఆహారంతో నిండిన ఒక పళ్ళాన్ని మా కొరకు అవతరింపజేయి (దింపు); అది మాకు మొదటివాని నుండి చివరివాని వరకు పండుగగా ఉండాలి; అది నీ తరపు నుండి ఒక సూచనగా ఉండాలి. మాకు ఆహారాన్ని ప్రసాదించు. నీవే అత్యుత్తమమైన ఉపాధి ప్రదాతవు!" అని ప్రార్థించాడు.
(అప్పుడు) అల్లాహ్: "నిశ్చయంగా, నేను దానిని మీపై అవతరింపజేస్తాను (దింపుతాను). కాని, దాని తరువాత కూడా మీలో ఎవడైనా సత్యతిరస్కారానికి పాల్పబడితే! నిశ్చయంగా, వానికి నేను ఇంత వరకు సర్వలోకాలలో ఎవ్వడికీ విధించని శిక్షను విధిస్తాను!" అని అన్నాడు.
మరియు (జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్ : "ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) ఏమీ? నీవు ప్రజలతో: 'అల్లాహ్ కు బదులుగా నన్నూ మరియు నా తల్లినీ ఆరాధ్యులుగా చేసుకోండి!" అని చెప్పావా?" అని ప్రశ్నించగా! దానికి అతను (ఈసా) అంటాడు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు. నాకు పలకటానికి అర్హతలేని మాటను నేను పలకటం తగినపని కాదు. ఒకవేళ నేను అలా చెప్పి ఉంటే నీకు తప్పక తెలిసి ఉండేది. నా మనస్సులో ఉన్నది నీకు తెలుసు, కాని నీ మనస్సులో ఉన్నది నాకు తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వ అగోచర విషయాలు తెలిసినవాడవు!
"నీవు ఆదేశించింది తప్ప, నేను మరేమీ వారికి చెప్పలేదు, అంటే: ' నా ప్రభువు మరియు మీ ప్రభువు అయిన అల్లాహ్ నే ఆరాధించండి.' అని. నేను వారి మధ్య ఉన్నంత వరకు వారికి సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టుకుని ఉన్నావు.[1] మరియు నీవే ప్రతి దానికి సాక్షివి!"[2]
[1] చూడండి, 3:55. [2] షహీదున్ (అష్-షహీదు): All-Witness, The Omniscient. సర్వసాక్షి, తన జ్ఞానంతో ప్రతిచోట ఉండేవాడు. చూడండి, 3:98, 58:6.
అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం లాభదాయక మవుతుంది. వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు లభిస్తాయి. అక్కడ వారు శాశ్వతంగా కలకాలముంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయనతో ప్రసన్నులవుతారు. ఇదే గొప్ప విజయం (సాఫల్యం)!"