మరియు పురుషుడు దొంగ అయినా, లేదా స్త్రీ దొంగ అయినా, వారి చేతులను నరికి వేయండి. ఇది వారి కర్మలకు గుణపాఠంగా అల్లాహ్ నిర్ణయించిన ప్రతిఫలం (శిక్ష).[1] మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.
[1] ఈ శిక్ష వివరాలను గురించి 'హదీస్', ఫిఖ్ మరియు తఫాసీర్ పుస్తకాలను చదవాలి. ఇస్లాంలో ఈ విధంగా కఠినశిక్షలు ఉండటం వల్లనే ఇస్లామీయ శాసనం పాటించే దేశాలలో - ఎక్కడైతే ఇంత వరకు షరీ'అత్ శాసనమే అమలులో ఉందో - ఉన్నంత శాంతి భద్రతలు సుఖసంతోషాలు మరే ఇతర 'గైరు షరీ'అత్ శాసనాలు పాటించే దేశాలలో లేవు. ఉదా: స'ఊదీ 'అరేబియా.
ఎవడు నేరం చేసిన తరువాత పశ్చాత్తాప పడి తనను తాను సవరించు కుంటాడో! నిశ్చయంగా, అల్లాహ్ అలాంటి వాని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
ఏమీ? నిశ్చయంగా, భూమ్యాకాశాలపై ఆధిపత్యం అల్లాహ్ దేనని నీకు తెలియదా? ఆయన తాను కోరిన వారిని శిక్షిస్తాడు మరియు తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.
ఓ ప్రవక్తా! సత్యతిరస్కారంలోకి పరుగులు తీసే వారి వల్ల నీవు దుఃఖపడకు. అలాంటి వారు: "మేము విశ్వసించాము." అని తమ నోటితో మాత్రమే అంటారు. కాని వారి హృదయాలు విశ్వసించలేదు. మరియు యూదులలో కొందరు అసత్యాలను కుతూహలంతో వినే వారున్నారు మరియు నీ వద్దకు ఎన్నడూ రాని ఇతర ప్రజలకు (అందజేయటానికి) మీ మాటలు వినే వారున్నారు. వారు పదాల అర్థాలను మార్చి, వాటి సందర్భాలకు భిన్నంగా తీసుకుని ఇలా అంటారు: "మీకు ఈ విధమైన (సందేశం) ఇస్తేనే స్వీకరించండి మరియు ఇలాంటిది ఇవ్వక పోతే, జాగ్రత్త పడండి!" మరియు అల్లాహ్ ఎవరిని పరీక్షించ దలచాడో (తప్పు దారిలో వదల దలచాడో) వారిని అల్లాహ్ నుండి తప్పించటానికి నీవు ఏమీ చేయలేవు. ఎవరి హృదయాలను అల్లాహ్ పరిశుద్ధ పరచ గోరలేదో అలాంటి వారు వీరే. వారికి ఇహలోకంలో అవమానం ఉంటుంది. మరియు వారికి పరలోకంలో ఘోర శిక్ష ఉంటుంది.