ఓ విశ్వాసులారా! ఒక జాతి వారు (మీకు హాని చేయ సంకల్పించి) తమ చేతులను మీ వైపునకు చాచినపుడు, అల్లాహ్ వారి చేతులను మీ నుండి తొలగించి మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు విశ్వాసులు అల్లాహ్ పైననే నమ్మక ముంచుకుంటారు.
మరియు వాస్తవానికి అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. మరియు మేము వారిలో నుండి పన్నెండు మందిని (కనాన్ కు) పోవటానికి నాయకులుగా నియమించాము.[1] మరియు అల్లాహ్ వారితో ఇలా అన్నాడు: "ఒకవేళ మీరు నమాజ్ స్థిరంగా సలుపుతూ, విధి దానం (జకాత్) చెల్లిస్తూ మరియు నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడుతూ, అల్లాహ్ కు మంచి రుణాన్ని ఇస్తూ వుంటే! నిశ్చయంగా, నేను మీకు తోడుగా ఉంటాను. మరియు నిశ్చయంగా, నేను మీ నుండి మీ పాపాలను తొలగిస్తాను మరియు నిశ్చయంగా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాను. కానీ, దీని తరువాత మీలో ఎవడు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తాడో! అతడు వాస్తవంగా, సరైన మార్గం నుండి తప్పి పోయిన వాడే!"
ఆ పిదప వారు తాము చేసిన ఒడంబడికను భంగం చేసినందుకు, మేము వారిని శపించాము (బహిష్కరించాము) మరియు వారి హృదయాలను కఠినం చేశాము. వారు పదాలను తారుమారు చేసి వాటి అర్థాన్ని, సందర్భాన్ని పూర్తిగా మార్చి వేసేవారు.[1] వారికి ఇవ్వబడిన బోధనలలో అధిక భాగాన్ని మరచిపోయారు. అనుదినం వారిలో ఏ కొందరో తప్ప, పలువురు చేసే ద్రోహాన్ని గురించి నీకు తెలుస్తూనే ఉంది. కనుక వారిని మన్నించు మరియు వారి చేష్టలను ఉపేక్షించు. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.