[1] 'ఈ ప్రయాణాన్ని మేము మా దాసునికి కొన్ని అద్భుత నిదర్శనాలు, సంకేతాలను చూపటానికి చేయించాము.' ఇంత దూరప్రయాణం రాత్రిపూట స్వల్పకాలంలో పూర్తి చేయించడం కూడా ఒక అద్భుత సూచనయే. ఈ ప్రయాణం రెండు భాగాలలో ఉంది. (1) మొదటి భాగం : ఇస్రా' జిబ్రీల్ ('అ.స.) తెచ్చిన బుర్రాఖ్ పై ఎక్కి అతనితో బాటు, మక్కా ముకర్రమా నుండి బైతుల్-మఖ్దిస్ కు రాత్రిపూట పయనించడం, అక్కడ మహాప్రవక్త ('స'అస) సర్వదైవప్రవక్తలకు ('అలైహిమ్ స.) ఇమాముగా నిలిచి నమా'జ్ చేయించడం. (2) రెండో భాగం మే'రాజ్ : అంటే పైకి ఎక్కించబడటం, లేక పైకి తీసుకొని పోబడటం. బైతుల్-మఖ్దిస్ నుండి ఆకాశాలలోనికి, చివరకు సిద్రతుల్ ముంతహా వరకు పోయిన ప్రయామం. అది 'అర్ష్ క్రింది ఏడవ ఆకాశంపై ఉంది. అక్కడ అతనికి ('స'అస) అల్లాహుతా'ఆలా వ'హీ ద్వారా నమా'జ్ మరియు ఇతర ఆదేశాలు ఇచ్చాడు. ఆ విషయాలు 'స'హీ'హ్ 'హదీస్ లలో పేర్కొనబడ్డాయి. మే'రాజ్ గురించి కొంతవరకు సూరహ్ అన్-నజ్మ్ (53) లో కూడ ఉంది. మే'రాజ్ సమయంలో దైవప్రవక్త ('స'అస), ఆకాశాలలో ఇతర ప్రవక్తలతో కలుసుకున్నారు. ఈ ప్రయాణం దైవప్రవక్త పూర్తి చేసింది కలలో కాదు. అతను శారీరకంగా మేల్కొని ఉండి, పూర్తి స్పృహలో ఉన్న స్థితిలో (Bodily, Fully awake and with Full Consciousness and orientation of Mind) చేశారు. ఈ ప్రయాణం అల్లాహుతా'ఆలా ఆజ్ఞతో జరిగింది. అల్లాహ్ (సు.తా.) తాను కోరినది చేస్తాడు. ఇది జరిగిన కాలం మరియు తేదీలలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు రబీ'అ అల్ అవ్వల్ 17 లేక 27వ తేదీలలో అని, మరి కొందరు రజబ్ 27 అని, మరి కొందరు ఇతర నెలలని కూడా అంటారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
[1] అల్లాహుతా'ఆలా మూసా ('అ.స.)తో సూటీగా మాట్లాడిన దానికి చూడండి, 4:164, 7:144.
[1] మొదటి శిక్ష దాదాపు క్రీస్తు శ ఆరంభానికి 600 సంవత్సరాలకు ముందు వచ్చింది. ఇది బాబిలోనియన్ పాలకుడు బ'ఖ్త్ న'స్ర్ ఇస్రాయీ'ల్ సంతతి వారిపై జెరూసలంలో చేసిన దౌర్జన్యం. అతడు ఎంతో మంది యూదులను చంపి మిగిలిన వారిని ఖైదీలుగా, బానిసలుగా చేసుకున్నాడు. ఈ శిక్ష వారు దైవప్రవక్తలను చంపినందుకు మరియు తౌరాత్ ఆజ్ఞలను ఉల్లంఘించినందుకు పడింది. కొందరి అభిప్రాయంలో ఈ రాజు జాలూత్. ఆ తరువాత 'తాలూత్ సైన్యాధిపత్యంలో ఉన్న దావూద్ ('అ.స.) జాలూత్ ను సంహరించి వారికి విముక్తి కలిగించారు.
[1] రెండవసారి యూదులు అత్యాచారాలు చేశారు. జ'కరియ్యా ('అ.స.)ను చంపారు. ఏసు క్రీస్తును సిలువపై ఎక్కించగోరారు కాని అల్లాహుతా'ఆలా అతనిని సజీవునిగా ఆకాశాలలోకి ఎత్తుకున్నాడు. అప్పుడు అల్లాహుతా'ఆలా రోమన్ పాలకుడు టైటస్ ను వారి పైకి పంపాడు. అతడు జేరూసలంపై దండయాత్ర చేసి యూదులను నాశనం చేశాడు. వారిని ఖైదీలుగా, బానిసలుగా చేసుకున్నాడు. హైకిలె సులేమాన్ ను నాశనం చేశాడు. యూదులను బైతుల్ మ'ఖ్దిస్ నుండి వెళ్ళగొట్టాడు. ఇది దాదాపు క్రీ.శ. 70వ సంవత్సరంలో జరిగింది.
[1] చూడండి, 'స. బు'ఖారీ, పు. 9, 'హ. నం. 625. ఇమామ్ షౌకాని 'తాయిరతున్ - అంటే మానవుని అదృష్టం లేక భవిష్యత్తు, అని అన్నారు. అల్లాహుతా'ఆలా కు జరుగబోయేది అంతా తెలుసు కాబట్టిఆయన ప్రతివాని అదృష్టం వ్రాసి అతని వెంట ఉంచుతాడు. అందుకొరకే దాని ప్రకారం అతని కర్మలు (మంచి-చెడులు) ఉంటాయి. పునరుత్థాన దినమున వాటికి తగినట్టి ప్రతిఫలమే దొరుకుతుంది.
[1] ఇలాంటి సందేశానికి చూడండి, 6:164, 35:18, 39:7 మరియు 53:38. దీని మరొక తాత్పర్యం: 'భారం మోసేవానిపై మరొకని భారం మోపబడదు.'
[1] అల్లాహుతా'ఆలా ఈ ఆయత్ లో తన ఆరాధన తరువాత, రెండో స్థానంలో, తమ తల్లిదండ్రులతో మంచిగా వ్యవహించాలని ఆజ్ఞాపించాడు. దీనితో వారి ఆదరణ, ఆజ్ఞాపాలన మరియు వారికి వినయవిధేయతలు చూపటం ఎంత ముఖ్యమో తెలుస్తోంది.
[1] ఇక్కడ విశదమయ్యేది ఏమిటంటే మన సంపత్తిలో దగ్గరి బంధువులకు, పేదలకు మరియు బాటసారులకు హక్కు ఉంది. కావున వారికి ఇవ్వటం, వారిని కనికరించటమని భావించరాదు. వారికి, వారి హక్కు ఇవ్వని వారు అల్లాహుతా'ఆలా దృష్టిలో నిందార్హులు. ఈ ఆయత్ లో పేర్కొన్నట్లు ధన సహాయానికి మొట్టమొదటి హక్కుదార్లు, దగ్గరి బంధువులు, ఎవరి పోషణైతే విధి కాదో వారు, తరువాత పేదవారు ఆ తరువాత బాటసార్లు అని తెలుస్తోంది.
[1] ఒకవేళ నీవు బంధువులకు, పేదలకు ఇవ్వలేని స్థితిలో ఉంటే, వారిని కసిరి కొట్టే బదులు, నమ్రతతో, మృదువుగా నిరాకరించు.
[1] ఇదే విధమైన వాక్యానికి చూడండి, 5:64.
[1] చూడండి, 6:137, 6:151, 81:8-9లలో మరియు 'స'హీహ్ బు'ఖారీలో: 'షిర్క్ తరువాత ఘోరపాపం, పేదరికానికి భయపడి తన సంతానాన్ని హత్య చేయటం.' అని ఉంది. అంటే, పేమిలీ ప్లానింగ్ చేయటం, అబార్షన్ చేయించుకోవటం.
[1] వ్యభిచారం అంటే భార్యా-భర్త కాకుండా, ఏ ఇతర ఆడ-మగ, మగ-మగ లేక ఆడ-ఆడ వారి మధ్య ఉండే లైంగిక సంబంధం. వారిలో ఏ ఒక్కరూ లేక ఇద్దరూ వివాహితులైనా కాకపోయినా.
[1] చూడండి, 2:190. అంటే, ధర్మయుద్ధంలో గానీ లేక న్యాయ ప్రతీకారానికి గానీ, లేక ఆత్మరక్షణకు గానీ కాకుండా, అన్యాయంగా ఏ ప్రాణిని కూడా చంపరాదు. [2] అల్-ఖి'సా'సు: న్యాయ ప్రతీకారం. చూడండి, 2:178. ఇక్కడ వలీ అంటే రక్తసంబంధీకుడైన దగ్గర బంధువు అని అర్థం.
[1] మానవుడు అల్లాహ్ (సు.తా.)తో చేసుకున్న వాగ్దానమైనా, లేక తన తోటి మానవునితో చేసిన వాగ్దానమైనా దానిని తప్పక పూర్తి చేయాలి, లేకుంటే పునరుత్థాన దినమున దానిని గురించి ప్రశ్నించడం జరుగుతుంది.
[1] అంటే నీకు తెలియని దానిని గురించి ఇతరులపై అనుమానపడకు. మరియు నీకు తెలియని దానిని అనుసరించకు.
[1] విర్రవీగటం అల్లాహుతా'ఆలాకు ఎంతో అసహ్యకరమైనది. ఖారూన్ విర్రవీగటం వల్లనే, తన ధనసంపత్తులతో సహా భూమిలోకి త్రొక్కి వేయబడ్డాడు. చూడండి, 28:81.
[1] వారు అల్లాహ్ (సు.తా.)కు కుమార్తెలను మరియు తమకేమో కుమారులను ఎన్నుకుంటున్నారు. చూడండి, 16:57-59.
[1] ప్రతివిధంగా బోధించాము: అంటే పూర్వకాలపు ప్రజల కథలు చెప్పి, ఉదాహరణలు, ఉపమానాలు ఇచ్చి, హితబోధలు చేసి, పర్యవసానాలు చూపి, అనేక విధాలుగా అల్లాహ్ (సు.తా.) ఖుర్ఆన్ లో బోధించాడు, భయపెట్టాడు. బహుశా మానవులు గుణపాఠం నేర్చుకొని, అతి స్వల్పకాలపు ఈ జీవితంలో విశ్వసించి, సత్కార్యాలు చేసి, రాబోయే శాశ్వత జీవితంలో ఎడతెగని సుఖసంతోషాలు పొందాలని. కాని చాలా మంది దానిని అర్థం చేసుకోలేక పోతున్నారు. తమ భ్రష్టాచారాలను మరింత అధికం చేసుకుంటున్నారు.
[1] ఈ ఆయత్ ను వ్యాఖ్యాతలు రెండు విధాలుగా బోధించారు: (1) ఇద్దరు లేక అంతకంటే ఎక్కువమంది రాజులు ఉంటే, వారిలో ప్రతి ఒక్కడు భూమిలో ప్రతి చోటా తన అధికారాన్నే నెలకొల్పటానికి పాటు పడతాడు. అదే విధంగా ఈ ఇతర దేవతలు కూడా ప్రయత్నించేవారు, ఒకవేళ వారు ఉండి ఉంటే! అది ఇంత వరకు జరుగలేదు. అంటే అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక విశ్వసామ్రాజ్యాధిపతి లేడు. (2) ఏ విధంగానైతే ముష్రికులు భావిస్తున్నారో: వారు ఆరాధించేవారు ఇంత వరకు అల్లాహ్ (సు.తా.) సాన్నిహిత్యాన్ని పొంది ఉన్నారు మరియు తమను ఆరాధించే వారిని కూడా అల్లాహ్ (సు.తా.) దగ్గరకు తీసుకుపోవటానికి ప్రయత్నిస్తారు. ఇది సత్యం కాదు. ఈ విషయం అల్లాహుతా'ఆలా తన గ్రంథం (ఖుర్ఆన్)లో ఎన్నో సార్లు విశదం చేశాడు. చూడండి, 17:57.
[1] చూడండి, 6:25 మరియు 2:7.
[1] వారు దైవప్రవక్త ('స'అస) ను మాంత్రికుడు, మంత్రజాలానికి గురి అయినవాడు, పిచ్చివాడు, జ్యోతిష్యుడు అని నోటికి వచ్చినట్లు ఆరోపించారు. ఎందుకంటే వారు మార్గభ్రష్టులైన వారు కాబట్టి వారెన్నడూ మార్గదర్శకత్వం పొందలేరు.
[1] పరలోక జీవితంతో పోల్చితే ఇహలోక జీవితకాలం ఎంతో చిన్నది. పరలోక జీవితం అంతం లేనిది. మానవుని కాలగణనం ఈ భూలోకానికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే దాని గణన భూగోళపు తన చుట్టూ చేసే పర్యటనకు బద్ధమై ఉంది. చూడండి, 79:46, 20:102, 104, 30:55, 23:112, 114.
[1] ఇది ప్రతి ఒక్కడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జ్ఞాపకముంచుకోవలసిన ఆయత్. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'మీలో ఎవ్వరు కూడా తన సోదరుని (ముస్లిం) వైపునకు ఆయుధాన్ని చూపకండి. ఎందుకంటే మీకు తెలియకుండానే షై'తాన్ ఆ ఆయుధాన్ని నడిపించి అతన్ని చంపించవచ్చు మరియు మీరు నరకాగ్నిలో పడి పోవచ్చు.' ('స. బు'ఖారీ, ముస్లిం). ఇంకా చూడండి, 16:125 మరియు 29:46.
[1] దావూద్ ('అ.స.) పై అవతరింపజేయబడిన దివ్యగ్రంథం 'జబూర్ (కీర్తనలు / Psalms).
[1] వారు ఆ దైవాలు: అంటే, యూదులూ మరియు క్రైస్తవులు, దేవుళ్ళని భావించే 'ఉ'జైర్ ('అ.స.) లేక 'ఈసా ('అ.స.) గానీ ; లేక ముష్రికులు ఆరాధించే జిన్నాతులు గానీ, దైవదూతలు గానీ, కల్పిత దైవాలు గానీ, విగ్రహాలు గానీ లేక పుణ్యవంతులైన ముస్లింలు గానీ, లేక ఇతర వలీలు గానీ కావచ్చు. వీరంతా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందే మార్గాన్ని వెతుకుతున్నారు. అలాంటప్పుడు వారు ఇతరులకు ఏ విధంగా సహాయపడగలరు. వీరిని ఆరాధించటం మరియు వీరి సహాయం కోరటం షిర్క్. అల్లాహ్ (సు.తా.) షిర్క్ ను ఎన్నడూ క్షమించడు.
[1] పూర్వకాలపు ప్రజలు తమ ప్రవక్తల నుండి నిదర్శనాలు (ఆయాత్) కోరారు. ఆ నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా వారు విశ్వాసులు కాలేదు. దాని ఫలితంగా వారిపై అల్లాహ్ (సు.తా.) శిక్ష పడి వారు నాశనం చేయబడ్డారు. ఇదే విధంగా మక్కా ముష్రిక్ లు కూడా దైవప్రవక్త ('స'అస) నుండి నిదర్శనాలు కోరారు. మక్కా పర్వతాలను బంగారంగా మార్చమన్నారు. పూర్వ జాతి వారి వలే వీరూ నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా విశ్వసించరని మరియు వారంతా నాశనం చేయబడతారని అతను ('స'అస) నిదర్శనాలను కోరలేదు. (వివరాలకు చూడండి, ముస్నద్ అ'హ్మద్, పుస్తకం-1, పేజీ 258) [2] ఆ ఆడ ఒంటె నిదర్శనం కొరకు చూడండి, 7:73 మరియు 54:27.
[1] దైవప్రవక్త ('స'అస) యొక్క రాత్రివేళ మస్జిద్ అల్-'హరాం నుండి మస్జిద్ అల్ అ'ఖ్సా మరియు అక్కడ నుండి సప్తాకాశాలలోనికి పోవటం మరియు తమ ప్రయాణాలలో సాక్షాత్తుగా చూసిన దృశ్యాల వివరణ విశ్వాసులకు వారి విశ్వాసాన్ని అధికం చేసింది మరియు సత్యతిరస్కారులకు వారి తలబిరుసుతనాన్ని. [2] ఆ నరకవృక్షఫలాలు, నరకవాసులకు ఆహారంగా ఇవ్వబడతాయి. దాని పేరు 'జఖ్ఖూమ్ (జెముడు వృక్షం). దాని వివరాలకు చూడండి, 37:62-66 44:43-44.
[1] ఆదమ్ ('అ.స.) వివరాలక కొరకు చూడండి, 2:30-34, 7:11-18, 15:26-41 మరియు సూరహ్ లు 18, 20, 38 కూడా.
[1] ఇబ్లీస్ మాటల కొరకు చూడండి, 7:16-17
[1] 'సౌతిక: నీ ధ్వని అంటే పాటలు, వాద్యాలు మరియు ఇతర మోసపుచ్చే మాటలు, అని అర్థం. వీటితో ష'తాన్ మానవులను మోసపుచ్చుతాడు. [2] దళాలు అంటే - షైతాను అడుగు జాడలను అనుసరించే మానవులు, జిన్నాతులు. [3] అమ్వాల్ వ అవ్ లాద్: అంటే సంపదలు మరియు సంతానం. అంటే నిషిద్ధ ( 'హరామ్) మార్గాలతో సంపాదించి, 'హరామ్ చేష్టలలో ఖర్చు చేసే ధనసంపత్తులు మరియు వ్యభారం వల్ల వచ్చే సంతానం. [4] 'షైతాన్ వాగ్దానాలు అంటే స్వర్గనరకాలు అనేవి ఏమీ లేవు, మరణించిన తరువాత పునరుత్థానం అనేది లేదు. మన జీవితం ఈ భూలోక జీవితం మాత్రమే. కావున వీలైనంత వరకు దీని సుఖసంతోషాలను మీకు తోచినట్లు అనుభవించండి, అని ప్రజలను మోసపుచ్చటం. [5] చూడండి, 4:120
[1] నా దాసులు: అంటే అల్లాహ్ (సు.తా.) ను నమ్ముకుని ఆయనపై ఆధారపడి, ఆయన చూపిన మార్గం మీదనే నడిచే సద్పురుషులు. అల్లాహ్ (సు.తా.) అలాంటి వారి, రక్షకుడు మరియు కార్యకర్త. షై'తాన్ కు అలాంటి వారిపై ఎలాంటి అధికారం ఉండదు. చూడండి, 14:22 మరియు 15:42
[1] ఏ విధంగానైతే అల్లాహ్ (సు.తా.) కు అవిధేయులైన, పూర్వ తరాల వారు శిక్షింపబడ్డారో, అలా మీరు కూడా శిక్షింపబడరని భావిస్తురా?
[1] తబీ'ఉన్: పగతీర్చుకునేవాడు, కక్ష తీర్చుకునేవాడు. అంటే ఒకసారి మిమ్మల్ని సముద్రంలో తుఫాన్ నుండి క్షేమంగా బయట పెట్టిన తర్వాత ఆయన (అల్లాహుతా'ఆలాయే) మీ అవిధేయతకు కారణంగా మీరు మరల సముద్రంలోకి పోయినపుడు మిమ్మల్ని ముంచి వేయ వచ్చని మీరు భయపడరా? అప్పుడు ఆయన (సు.తా.)కు విరుద్ధంగా మీకు, మీ కల్పిత దైవాలు ఎవ్వరూ సహాయపడలేరు.
[1] చూడండి 2:31, వారికి మంచి చెడును అర్థం చేసుకునే విచక్షణా శక్తినీ, బుద్ధినీ ప్రసాదించాము.
[1] ఇమామ్: అంటే నాయకుడు ఇక్కడ వ్యాఖ్యాతలు దీనికి మూడు అర్థాలిచ్చారు. 1) దైవప్రవక్తలు, 2) దివ్యగ్రంథాలు, 3) కర్మపత్రాలు. ప్రతి ఒక్కరు తమ కాలపు దైవప్రవక్త లేక దివ్యగ్రంథం లేక కర్మపత్రంతో పిలువబడతారు. ఇబ్నె-కసీ'ర్ మరియు షౌకాని ఈ మూడవది అంటే కర్మపత్రమని భావిస్తున్నారు. చూడండి, 53:39. [2] చూడండి, 69:19 మరియు 84:7.
[1] ఇది ముష్రిక్ ఖురైషులు దైవప్రవక్త ('స'అస) ముందు పెట్టిన మరొక ప్రస్తావన. అంటే అతను వారి కల్పిత దైవాలను నిజమైన దైవాలని గుర్తిస్తే వారు కూడా అతనిని దైవప్రవక్తగా గుర్తిస్తామని పెట్టిన షరతు. దానిని అతను ('స'అస) నిరాకరించారు.
[1] కావున కొద్దికాలం తరువాత 2 హి.శ.లో బద్ర్ లో మక్కా ఖురైషుల పలువురు నాయకులు చంపబడ్డారు. మరియు 8వ హిజ్రీలో ముస్లింలు మక్కాను జయించారు.
[1] ఈ ఆయత్ లో ఐదు విధి (ఫ'ర్ద్) గా సలుప వలసిన నమా'జ్ ల ప్రస్తావన వచ్చింది. సూర్యుడు వాలిన తరువాత జుహ్ర్, సూర్యాస్తమయానికి కొంత కాలం ముందు 'అ'స్ర్, సూర్యాస్తమయం కాగానే మ'గ్ రిబ్, కొంత చీకటి పడ్డ తరువాత 'ఇషా మరియు ప్రాతఃకాలమున సూర్యోదయానికి ముందు ఫజ్ర్ చేయాలని. ఫజ్ర్ నమాజ్ లో ఖుర్ఆన్ పఠనం ఎక్కువగా చేయాలి. ఈ నమా'జ్ లను గురించి వివరాలు 'స'హీ'హ్ 'హదీస్'లలో ఉన్నాయి. [2] ప్రాతఃకాలపు ఫజ్ర్ నమా'జ్ సమయంలో పగటి మరియు రాత్రి దైవదూతలు కలుస్తారు. వారంతా ప్రజల నమా'జ్ లను చూస్తారు. మరియు దానిని గురించి అల్లాహుతా'ఆలాకు తెలుపుతారు. అది అల్లాహ్ (సు.తా.)కు అగోచరమైనది కాదు, కానీ ఆయన (సు.తా.) వారి నుండి తన ప్రజల ప్రశంసలు వినగోరుతాడు. ('స. బు'ఖారీ మరియు ముస్లిం).
[1] తహజ్జుద్: అంటే నిద్రాభంగం. ఇది నఫీల్ నమా'జ్, అంటే అదనంగా చేసే నమా'జ్. దైవప్రవక్త ('స'అస) రాత్రి మొదటి భాగంలో నిద్ర తీసుకొని, చివరి భాగంలో నిద్ర నుండి లేచి నమా'జ్ చేసేవారు, అదే తహజ్జుద్ నమా'జ్. 'స'హీ'హ్ 'హదీస్'లలో దీని వివరాలున్నాయి. ఇంకా చూడండి, 76:26.
[1] కొందరు వ్యాఖ్యాతలు ఈ ఆయత్ ప్రస్థానం (హిజ్రత్) సమయంలో అవతరింపజేయ బడిందని అంటారు. అంటే యస్'రిబ్ (మదీనా మునవ్వరా) ప్రవేశాన్ని మరియు మక్కా ముకర్రమా బహిర్గమనాన్ని సత్యమైనవి చేయమని దైవప్రవక్త ('స'అస) ప్రార్థిస్తున్నారు. మరికొందరు అంటారు: నన్ను సత్యం మీద మరణింపజేయి మరియు సత్యంతో పునరుత్థరింపజేయి. ఇమామ్ షౌకాని అంటారు: ఈ అన్నీ అర్థాలు కూడా సమంజసమైనవే, ఎందుకంటే ఇది ఒక దు'ఆ.
[1] మక్కా ముకర్రమా విజయం తరువాత, దైవప్రవక్త ('స'అస) కాబాలో ప్రవేశిస్తారు. అక్కడ 360 విగ్రహాలు ఉంటాయి. వాటిని ఒక చిన్న కట్టెతో కొట్టుతూ ఈ ఆయత్ చదువుతారు. ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం).
[1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 10:57
[1] మానవుడు సుఖసంతోషాలలో ఉన్నప్పుడు అల్లాహ్ (సు.తా.)ను మరచిపోతాడు మరియు కష్టకాలంలో నిరాశ చెందుతాడు. కాని ఒక విశ్వాసి రెండు పరిస్థితులలోనూ తన ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయన స్తోత్రం చేస్తూ ఉంటాడు. చూడండి, 11:9-11.
[1] అర్-రూ'హు: ఆత్మను గురించి కేవలం అల్లాహ్ (సు.తా.) కు మాత్రమే తెలుసు. దాని జ్ఞానం కేవలం నా ప్రభువు (సు.తా.) కు మాత్రమే ఉంది. దాని జ్ఞానం (సు.తా.) ప్రవక్తల (అ.స.)కు కూడా ఇవ్వలేదు. అది ఆయన (సు.తా.) ఆజ్ఞతో వస్తుంది: 'కున్ ఫ యకూన్.'
[1] చూడండి, 52:34.
[1] ఇది ముష్రిక్ ఖురైషులు ఇస్లాం స్వీకరించటానికి - మూసా ('అ.స.) బండ నుండి పన్నెండు ఊటలను ప్రవహింపజేసినట్లు, మీరు కూడా ప్రవహింపజేయండని - పెట్టిన షర్తు. చూ, 2:60.
[1] భయ పెట్టుటకు - ఇలాంటి ఆయత్ కు చూడండి, 34:9.
[1] అద్భుత సూచనలు కేవలం అల్లాహ్ (సు.తా.) చేతిలోనే ఉన్నాయి. ఆయన (సు.తా.) కోరితేనే వాటిని చూపుతాడు. చూడండి, 6:109.
[1] ఇటువంటి వాక్యానికి చూడండి, 17:49.
[1] చూడండి, 40:57, 46:33 మరియు 36:81-82. [2] నిర్ణీత సమయం అంటే పునరుత్థాన దినం.
[1] ఇటువంటి వాక్యానికి చూడండి, 4:53.
[1] మూసా ('అ.స.) కు ఇవ్వబడిన (ఫిర్'ఔన్ జాతి వారికి చూపిన) తొమ్మిది అద్భుత సూచనలు: 1) ప్రకాశించే చేయి, 2) సర్పంగా మారే చేతి కర్ర, 3) దుష్టులకు కలిగిన కరువు మరియు ఫల నష్టము, 4) 'తుఫాను, 5) మిడుతల దండు, 6) పేనులు, 7) కప్పలు, 8) రక్తం మరియు 9) సముద్రంలో ఏర్పడిన బాట. ఇవి సూరహ్ అల్-అ'అరాఫ్ (7) లో కూడా వివరించబడ్డాయి. ఇబ్నె'అబ్బాస్, ముజాహిద్, ఇక్రిమా, షాబీ, ఖతద ర'ది. 'అన్హుమ్ ల వ్యాఖ్యానం, (ఇబ్నె-క'సీర్). ఇవేగాక బండ నుండి తీసిన 12 ఊటలూ, మన్న మరియు సల్వాలు కూడా అద్భుత సూచనలే, కానీ వీటిని ఫిర'ఔన్ జాతి వారు చూడలేదు.
[1] మూసా ('అ.స.) యొక్క వివరాలకు చూడండి, 7:103-137 మరియు 20:49-79.