(సేవకుడు) ఇలా అన్నాడు: "చూశారా! మనం ఆ బండ మీద విశ్రాంతి తీసుకోవటానికి ఆగినపుడు వాస్తవానికి నేను చేపను గురించి పూర్తిగా మరచి పోయాను. షైతాను తప్ప మరెవ్వడూ నన్ను దానిని గురించి మరపింపజేయలేదు. అది విచిత్రంగా సముద్రంలోకి దూసుకొని పోయింది!"
అప్పుడు వారు మా దాసులలో ఒక దాసుణ్ణి (అచ్చట) చూశారు. మేము అతనికి మా అనుగ్రహాన్ని ప్రసాదించి,[1] అతనికి మా తరఫు నుండి విశిష్ట జ్ఞానం నేర్పి ఉన్నాము.[2]
[1] ర'హ్మాతున్: అంటే ఇక్కడ ప్రత్యేక అనుగ్రహాలు అని కొందరు వ్యాఖ్యాతలు అన్నారు. మరియు చాలా మంది వ్యాఖ్యాతలు దీనిని ప్రవక్త పదవిగా వ్యాఖ్యానించారు. [2] అల్లాహుతా'ఆలా 'ఖి'ద్ర్ ('అ.స.)కు ప్రవక్త పదవినే గాక, తన వైపు నుండి విశిష్ట జ్ఞానం కూడా ప్రసాదించాడు.
అతను అన్నాడు: "ఒకవేళ నీవు నన్ను అనుసరించటానికే నిశ్చయించుకుంటే, స్వయంగా నేనే నీతో ప్రస్తావించనంత వరకు నీవు నన్ను, ఏ విషయాన్ని గురించి కూడా ప్రశ్నించకూడదు."
ఆ పిదప వారిద్దరూ బయలుదేరారు. చివరికి వారిద్దరు పడవలో ఎక్కినపుడు అతను పడవకు రంధ్రం చేశాడు. (మూసా) అతనితో అన్నాడు: "ఏమీ? పడవలో ఉన్న వారిని ముంచి వేయటానికా, నీవు దానిలో రంధ్రం చేశావు? వాస్తవానికి, నీవు ఒక దారుణమైన పని చేశావు!"
ఆ పిదప వారు తమ ప్రయాణం సాగించగా వారికి ఒక బాలుడు కలిశాడు. అతను వానిని (బాలుణ్ణి) చంపాడు. (అది చూసి) మూసా అన్నాడు: "ఏమీ? ఒక అమాయకుడిని చంపావా? అతడు ఎవ్వడినీ (చంపలేదే)! వాస్తవానికి నీవు ఒక ఘోరమైన పని చేశావు!"