ఆయన ఏ విధమైన ప్రమాణం అవతరింపజేయనిదే, అల్లాహ్ కు సాటి కల్పించినందుకు, మేము సత్యతిరస్కారుల హృదయాలలో ఘోర భయాన్ని కల్పిస్తాము. వారి ఆశ్రయం నరకాగ్నియే! అది దుర్మార్గులకు లభించే, అతి చెడ్డ నివాసం.
మరియు వాస్తవానికి అల్లాహ్ మీకు చేసిన తన వాగ్దానాన్ని సత్యపరచాడు. ఎప్పుడైతే మీరు ఆయన అనుమతితో, వారిని (సత్యతిరస్కారులను) చంపుతూ ఉన్నారో![1] తరువాత మీరు పిరికితనాన్ని ప్రదర్శించి, మీ కర్తవ్య విషయంలో పరస్పర విభేదాలకు గురి అయ్యి - ఆయన (అల్లాహ్) మీకు, మీరు వ్యామోహపడుతున్న దానిని చూపగానే - (మీ నాయకుని) ఆజ్ఞను ఉల్లంఘించారు[2]. (ఎందుకంటే) మీలో కొందరు ఇహలోకాన్ని కోరేవారున్నారు మరియు మీలో కొందరు పరలోకాన్ని కోరేవారున్నారు. తరువాత మిమ్మల్ని పరీక్షించటానికి ఆయన (అల్లాహ్) మీరు మీ విరోధులను ఓడించకుండా చేశాడు. [3] మరియు వాస్తవానికి ఇపుడు ఆయన మిమ్మలన్ని క్షమించాడు. మరియు అల్లాహ్ విశ్వాసుల పట్ల ఎంతో అనుగ్రహుడు.
[1] ఇది విశ్వాసులకు మొదట లభించిన విజయం. [2] ఇది ఉ'హుద్ యుద్ధంలో గుట్ట మీద ఉంచబడిన 50 మంది విలుకాండ్ర విషయం. [3] శబ్దార్థ ప్రకారం : మీ విరోధుల యెదుట మిమ్మల్ని పారిపోయేటట్లు చేశాడు.
(జ్ఞాపకం చేసుకోండి!) ఎప్పుడయితే మీరు పారిపోతూ ఉన్నారో మరియు వెనుకకు కూడా తిరిగి ఎవరినీ చూడకుండా ఉన్నారో మరియు ప్రవక్త మీ వెనుక నుండి, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడో! అప్పుడు (మీ ఈ వైఖరికి) ప్రతిఫలంగా (అల్లాహ్) మీకు దుఃఖం మీద దుఃఖం కలుగజేసాడు; మీరు ఏదైనా పోగొట్టుకున్నా, లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించకుండా ఉండేందుకు. మరియు మీ కర్మలన్నింటినీ అల్లాహ్ బాగా ఎరుగును.