(వారి కొరకు) ఎవరైతే కలిమిలోనూ మరియు లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు తమ కోపాన్ని నిగ్రహించుకుంటారో మరియు ప్రజలను క్షమిస్తారో! అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.[1]
[1] 'స. బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 141 మరియు 'స. బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 135.
మరియు వారు, ఎవరైతే, అశ్లీల పనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్ ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్ తప్ప, పాపాలను క్షమించ గలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను), బుద్ధిపూర్వకంగా మూర్ఖపు పట్టుతో మళ్ళీ చేయరు! [1]
ఇలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు నుండి క్షమాభిక్ష మరియు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసేవారికి ఎంత శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉంది!
ఒకవేళ ఇప్పుడు మీరు గాయపడితే, వాస్తవానికి ఆ జాతివారు (మీ విరోధులు) కూడా ఇదే విధంగా గాయపడ్డారు[1]. మరియు మేము ఇలాంటి దినాలను ప్రజల మధ్య త్రిప్పుతూ ఉంటాము. మరియు అల్లాహ్, మీలో నిజమైన విశ్వాసులెవ్వరో చూడటానికి మరియు (సత్యస్థాపనకు) తమ ప్రాణాలను త్యాగం చేయగల వారిని ఎన్నుకోవటానికి ఇలా చేస్తూ ఉంటాడు. మరియు అల్లాహ్ దుర్మార్గులను ప్రేమించడు.