[1] ఇక్కడ ఫిత్నా - అంటే సత్యతిరస్కారం, షిర్క్, సత్యధర్మానికి అడ్డుగా నిలవటం. సత్యాన్ని స్వీకరించిన వారిని హింసా, దౌర్జన్యాలకు గురి చేయడం. చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 2, 'హదీస్' నం. 797. ఫిత్నతున్ : యొక్క ఇతర అర్థాలు పీడన, ఉపద్రవం, పరీక్ష, ప్రేరేపించటం, కలతలు రేకెత్తించటం, శోధన, పురికొల్పటం మరియు దుష్కృత్యం మొదలైనవి ఉన్నాయి. [2] మస్జిద్ అల్ - 'హరామ్ సరిహద్దులలో యుద్ధం చేయటం నిషేధించబడింది. అది శాంతినిలయం, కాని ఎవరైనా దానిని లెక్క చేయక మీపై దాడి చేసి మిమ్మల్ని చంపగోరితే, అలాంటి వారితో మీరు అక్కడ యుద్థం చేసి వారిని చంపవచ్చు!
[1] చూడండి, 2:191 వ్యాఖ్యానం 2. [2] చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 1, 'హదీస్' నం. 24.
[1] నిషిద్ధ మాసాలు: జు'ల్ - ఖాఇదహ్, జు'ల్ హిజ్జహ్, ము'హర్రం మరియు రజబ్ (హిజ్రీ శకపు 11, 12, 1, 7 మాసాలు). ఈ మాసాలలో యుద్ధం చేయటం ఇస్లాంకు పూర్వం నుండి కూడా అరేబియా వాసులలో నిషేధించబడి ఉండింది. చూడండి, 2:217. ఈ నిషేధాలను దరూ గౌరవించాలి. ఎదుటి వారు వాటిని గౌరవించని పక్షంలో వారితో పోరాడి ప్రతీకారం తీర్చుకోవచ్చు.
[1] 'ఉమ్రా: 'హజ్ సమయంలో కాకుండా వేరే దినాలలో కూడా 'ఉమ్రా చేయవచ్చు. 'ఉమ్రా చేయగోరే వారు 'హరమ్ సరిహద్దుల నుండి, (మీఖాత్ సరిహద్దుల బయట నుండి వచ్చే వారు మీఖాత్ నుండి) ఇ'హ్రామ్ ధరించి, (అంటే పురుషులు, ఒక తెల్లని లుంగీ కట్టుకొని మరొక తెల్లని దుప్పటిని శరీరంపై కప్పుకోవటం. స్త్రీలకు, వారు ధరించిన బట్టలే ఇ'హ్రామ్; మగవారివలే వారికి ప్రత్యేకమైన ఇ'హ్రామ్ దుస్తులు లేవు) 'హరమ్ కు వచ్చి, క'అబహ్ చుట్టు ఏడు ప్రదక్షిణలు ('తవాఫ్) చేసి, రెండు రకాతులు నమాజ్' చేసి, తరువాత 'సఫా, మర్వాల మధ్య ఏడుసార్లు పచార్లు (స'యీ) చేసి, ఆ తరువాత (స్త్రీలు) తల వెంట్రుకలను కొంత మట్టుకు కత్తిరించుకోవాలి. పురుషులు శిరోముండనం చేయించుకొని లేక తల వెంట్రుకలను కొంత మట్టుకు కత్తిరించుకొని ఇ'హ్రామ్ విడిచి పెట్టాలి. మీఖాత్ మరియు 'హరమ్ సరిహద్దులను మహా ప్రవక్త ('స'అస) సూచించారు. [2] దైవప్రవక్త ('స'అస) 6వ హిజ్రీలో 'ఉమ్రా కొరకు వచ్చినప్పుడు 'హుదైబియహ్ దగ్గరగా ఆగారు. అప్పుడు మక్కాలోని ముష్రిక్ ఖురైషులతో సంధి చేసుకున్నారు. 'హుదైబియహ్ లోనే తమ బలి (ఖుర్బానీ) చేసి తమ శిరోముండనాలు చేయించుకొని ఇ'హ్రాం వదిలారు. తరువాత 7వ హిజ్రీలో వచ్చి 'ఉమ్రా చేశారు. [3] శాంతి సమయాలలో 'హజ్ యొక్క అన్ని మనాసిక్ లు పూర్తి చేయనంత వరకు శిరోముండనం చేయించుకోగూడదు అంటే, ఇ'హ్రీమ్ విడువగూడదు. [4] తమత్తు' - అంటే 'హజ్ కాలంలో 'ఉమ్రా కొరకు ఇ'హ్రామ్ ధరించి 'ఉమ్రా చేసి శిరోముండనం చేసి, ఇ'హ్రామ్ విడవాలి. మరల 8వ జి'ల్-'హిజ్ రోజున 'హజ్ కొరకు ఇ'హ్రామ్ ధరించాలి. దీనికి బలి ఇవ్వ వలసి ఉంటుంది. బలి ఇవ్వలేని వారు 10 రోజులు ('హజ్ కాలంలో 3 రోజులు 'హజ్ తరువాత 7 రోజులు), ఉపవాసాలుండాలి. 'హజ్ 3 రకాలుగా చేయవచ్చు: అవి 1)ఇఫ్రాద్: అంటే 'హజ్ సంకల్పంతో ఇ'హ్రాం ధరించి కేవలం 'హజ్ మాత్రమే చేయటం. దీనికి బలి అవసరం లేదు. ఇది 'హరమ్ ప్రాంతంలో నివసించే వారు చేసే 'హజ్, 2) తమత్తు : పైన వివరించిన విధానం. 'హజ్జె తమత్తు'కు బలి (ఖుర్బానీ) ఇవ్వటం వాజిబ్. 3) ఖిరన్ : ఒకే ఇ'హ్రామ్ తో 'ఉమ్రా మరియు 'హజ్ నెరవేర్చటం. 'ఉమ్రా చేసిన తరువాత తలవెంట్రుకలు కత్తిరించుకోకుండా 'హజ్ వరకు ఇ'హ్రాంలోనే ఉండి 'హజ్ విదులు నెరవేర్చిన పిదప ఇ'హ్రామ్ విడవటం. 'హజ్జె ఖిరన్ కు కూడా బలి (ఖుర్బానీ) ఇవ్వటం వాజిబ్. [5] హద్ యున్, బలి (ఖుర్బానీ): ఒక వ్యక్తి ఒక మేక లేక గొర్రె; లేక ఏడుగురు కలిసి ఒక ఆవు, ఎద్దు, లేక ఒంటె బలి చేయవచ్చు.