[1] అల్లాహ్ (సు.తా.) ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఈ విన్నపాన్ని పూర్తి చేశాడు. ఇది 29:27లో పేర్కొనబడింది. [2] "నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు." అల్లాహ్ (సు.తా.) యొక్క ఈ ప్రవచనం ఎంతో ఆలోచింపదగినది. ఇక్కడ ఆయన విశదపరచింది ఏమిటంటే : ఒక మంచి సత్పురుషుని లేక ప్రవక్త సంతతికి చెందినంత మాత్రానా - వారు అవిశ్వాసులై, సత్కార్యాలు చేయని వారైతే - వారి వంశకీర్తి, వారి పెద్దల ప్రవక్తృత్వం వారికి ఏ విధంగానూ పనికిరాదు. ప్రతి ఒక్కడూ తన స్వంత విశ్వాసం మరియు సత్కార్యాల ఆధారంగానే ప్రతిఫలం పొందుతాడు. మహా ప్రవక్త ('స'అస) 'హదీస్' ఇలా ఉంది : "ఏ వ్యక్తి వ్యవహారాలైతే అతనిని వెనుక విడిచాయో, అలాంటి వ్యక్తి పుట్టు పూర్యోత్తరాలు, వంశ ప్రతిష్ఠలు అతనిని ఏ మాత్రం ముందుకు తేలేవు." ('స'హీ'హ్ ముస్లిం).