[1] హిజ్రీ శకంలోని రజబ్, జు'ల్-ఖాయిదహ్, జు'ల్-'హిజ్జహ్ మరియు ము'హర్రమ్ నెలలు నిషిద్ధమాసాలు. ఈ మాసాలలో యుద్ధం నిషిద్ధం. ఇది 'అరబ్బులలో ఇస్లాంకు ముందు నుండి వస్తూ ఉన్న ఆచారం. చూడండి, 2:194, 217. ఇబ్నె-కసీ'ర్ (ర'హ్మ) ఇక్కడ (ఈ ఆయత్ లో) నిషిద్ధమాసాలు అంటే ఈ ప్రకటన తరువాత నాలుగు నెలలు అంటే 10వ జు'ల్-'హిజ్జహ్ నుండి 10వ రబీ'అ-అత్తాని వరకు, అని అన్నారు. [2] 'హరమ్ సరిహద్దులలో కేవలం వారితోనే పోరాడాలి, ఎవరైతే మీపై దాడి చేస్తారో! చూడండి,2:190-194, (ఇబ్నె-కసీ'ర్). మీతో యుద్ధం చేసే వారితోఅల్లాహ్ (సు.తా.) మార్గంలో పోరాడండి. ఎవరైతే మీతో విరోధాలు చేయరో, వారితో పోరాడవద్దు. జిహాద్ అంటే, మీరు ముస్లింలు అయి ఉండి. ఇతరులకు శాంతియుతంగా ఏక దైవసిద్ధాంతాం, సత్యధర్మం అయిన ఇస్లాంను బోధిస్తూ ఉంటే, మీ మార్గంలో ఆటంకాలు పెడుతూ, మీ ధన, మాన, ప్రాణాలకు హాని గలిగించగోరే వారితో, వారు మానుకునే వరకు లేదా నిర్మూలించబడే వరకు చేసే ధర్మయుద్ధం. చూడండి, 4:91. అంటే ఆత్మ సంరక్షణ కొరకు చేసే పోరాటం జిహాద్. చూడండి, 60:8-9. [3] ఖైదీలుగా చేసుకొనండి. [4] వారి రాకపోకడలపై కాపలా పెట్టండి. మీ అనుమతి లేనిదే వారిని కదలనివ్వకండి. వారి నివాస స్థలాలను కాపెట్టుకొని ఉండండి. [5] చూడండి, 2:256. 'ధర్మ విషయంలో బలవంతం లేదు.' అంటే ఎవ్వరినీ కూడా ఇస్లాం స్వీకరించటానికి బలవంతం చేయకూడదు.