ఓ విశ్వాసులారా! మీరు ప్రవక్తతో ఏకాంతంలో మాట్లాడదలిస్తే, మాట్లాడబోయే ముందు, ఏదైనా కొంత దానం చేయండి. ఇది మీ కొరకు ఉత్తమమైనది మరియు చాలా శ్రేష్ఠమైనది. కాని (ఒకవేళ దానం చేయటానికి) మీ వద్ద ఏమీ లేకపోతే, నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత అని తెలుసుకోండి.
ఏమీ? మీరు (ప్రవక్తతో) ఏకాంత సమాలోచనలకు ముందు దానాలు చేయవలసి ఉన్నదని భయ పడుతున్నారా? ఒకవేళ మీరు అలా (దానం) చేయకపోతే అల్లాహ్ మిమ్మల్ని మన్నించాడు, కావు మీరు నమాజ్ ను స్థాపించండి మరియు విధి దానం (జకాత్) ఇవ్వండి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. వాస్తవానికి మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.
ఏమీ? అల్లాహ్ ఆగ్రహానికి గురి అయిన జాతి వారి వైపుకు మరలిన వారిని నీవు చూడలేదా? వారు మీతో చేరిన వారు కారు మరియు వారితోను చేరినవారు కారు. వారు బుద్ధిపూర్వకంగా అసత్య ప్రమాణం చేస్తున్నారు.
అల్లాహ్ (శిక్ష) నుండి కాపాడటానికి, వారి సంపదలు గానీ, వారి సంతానం గానీ వారికి ఏ మాత్రం పనికిరావు. ఇలాంటి వారే నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
అల్లాహ్ వారందరినీ మరల బ్రతికించి లేపిన రోజు, వారు మీతో ప్రమాణాలు చేసినట్లు ఆయన (అల్లాహ్) ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. మరియు దాని వలన వారు మంచి స్థితిలో ఉన్నారని భావిస్తారు. జాగ్రత్త! నిశ్చయంగా, ఇలాంటి వారే అసత్యవాదులు!
షైతాన్ వారిపై ప్రాబల్యం పొంది నందు వలన వారిని అల్లాహ్ ధ్యానం నుండి మరపింప జేశాడు. అలాంటి వారు షైతాన్ పక్షానికి చెందిన వారు. జాగ్రత్త! షైతాన్ పక్షానికి చెందినవారు, వారే! నిశ్చయంగా నష్టపోయేవారు.