మరియు యూదులు: "అల్లాహ్ చేతులకు సంకెళ్ళు పడి ఉన్నాయి." అని అంటారు.[1] వారి చేతులకే సంకెళ్ళు వేయబడుగాక! మరియు వారు పలికిన దానికి వారు శపించబడుగాక! వాస్తవానికి ఆయన (అల్లాహ్) రెండు చేతులు విస్తరింపబడి ఉన్నాయి; ఆయన (తన అనుగ్రహాలను) తాను కోరినట్లు ఖర్చు చేస్తాడు. మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు తరపు నుండి నీపై అవతరింపజేయబడినది (ఈ గ్రంథం) నిశ్చయంగా, వారిలో చాలా మందికి తలబిరుసుతనం మరియు సత్య తిరస్కారాన్ని మాత్రమే పెంచుతున్నది. మరియు మేము వారి మధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని, తీర్పుదినం వరకు ఉండేటట్లు చేశాము. వారు యుద్ధ జ్వాలలను ప్రజ్వలింపజేసినపుడల్లా, అల్లాహ్ దానిని చల్లార్చాడు. మరియు వారు భూమిలో కల్లోలం రేకెత్తించటానికి పాటు పడుతున్నారు. మరియు అల్లాహ్ కల్లోలం రేకెత్తించే వారిని ప్రేమించడు.