కావున ఎవరైతే తమ చేతులారా ఒక పుస్తకాన్ని వ్రాసి - దాని వల్ల తుచ్ఛమూల్యం పొందే నిమిత్తం - "ఇది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది." అని (ప్రజలకు) చెబుతారో, వారికి వినాశముంది. వారి చేతులు వ్రాసినందుకు వారికి వినాశముంది మరియు వారు సంపాదించిన దానికి కూడా వారికి వినాశముంది!
మరియు వారు (యూదులు) అంటారు: "మాకు నరకాగ్ని శిక్ష పడినా, అది కొన్ని రోజుల కొరకు మాత్రమే!" (ఓ ముహమ్మద్!) నీవు వారి నడుగు: "ఏమీ? మీరు అల్లాహ్ నుండి వాగ్దానం పొందారా? ఎందుకంటే, అల్లాహ్ తన వాగ్దానాన్ని ఎన్నడూ భంగం చేయడు. లేదా మీకు తెలియని విషయాన్ని మీరు అల్లాహ్ కు అంటగడుతున్నారా?"
మరియు మేము ఇస్రాయీలు సంతతి వారి నుండి ఇలా తీసుకున్న వాగ్దానం (జ్ఞప్తికి తెచ్చుకోండి): "మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు. మరియు తల్లిదండ్రులను, బంధువులను, అనాథులను, యాచించని పేదవారిని[1] ఆదరించాలి. మరియు ప్రజలను సహృదయంతో పలకరించాలి, నమాజ్ ను స్థాపించాలి మరియు జకాత్ ఇవ్వాని." అటు పిమ్మట మీలో కొందరు తప్ప, మిగతా వారంతా (తమ వాగ్దానం నుండి) తిరిగి పోయారు. మీరంతా విముఖులైపోయే వారే!
[1] మిస్కీన్: నిత్యావసరాలకు తగినంత ఆదాయం లేకున్నా యాచించని పేదవాడు. ఫఖీర్: ఆదాయం లేనందుకు విధి లేక యాచించే నిరుపేదలు.