[1] ఒక 'హదీస్'లో ఇలా ఉంది: "ఏ సమాజం వారైతే కొలతలలో మరియు తూనికలలో తగ్గిస్తారో! వారిపై కరువు మరియు పరిపాలకుల ఆగడాలు విరుచుకు పడతాయి." (ఇబ్నె - మాజా - అల్బానీ దీనిని 'స'హీ'హ్ గా ప్రమాణీకరించారు) ఈ మూడు ఆయతులు అన్ని రకాల మోసాలను ఖండిస్తున్నాయి.
[1] రానా: అంటే పాపాల వల్ల హృదయం మీద ఏర్పడే మచ్చ. 'హదీస్'లో ఇలా ఉంది: "మానవుడు పాపం చేసినపుడు అతని హృదయం మీద ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది. ఒకవేళ అతడు పశ్చాత్తాప పడి ఆ పాపం మరల చేయకుంటే అది దూరమై పోతుంది. ఒకవేళ అతడు పాపం మీద పాపం చేస్తూ ఉంటే ఆ నల్లమచ్చ పెరుగుతుంది. చివరకు అది అతని హృదయం మీద పూర్తిగా క్రమ్ముకొంటుంది. అదే 'రానా' అని పేర్కొనబడినది." (తిర్మిజీ', ఇబ్నె-మాజా, ముస్నద్ అ'హ్మద్).
[1] 'ఇల్లియ్యూన్, 'ఉలువ్వున్: ఎత్తైన స్థలం. ఇది సిజ్జీన్ కు విరుద్ధ పదం. ఇది ఆకాశాలలో, స్వర్గంలో సిద్ రతుల్ మున్ తహా, లేక 'అర్ష్ దగ్గర ఉన్నచోటు. అక్కడ పుణ్యాత్ముల కరపత్రాలు భద్రపరచబడి ఉంటాయి.
[1] ర'హీఖున్: స్వచ్ఛమైన, తేటైన, ఉత్తమమైన, మధురమైన పానీయం, అందులో ఎట్టి కల్తీ ఉండదు.
మ'ఖ్తూమున్: సీలు చేయబడినది. దాని స్వచ్ఛతకు హామీగా. కొందరు 'ఖితామున్ - అంటే సువాసన అంటారు. దాని సువాసన కస్తూరి వలే ఉంటుంది. (ఇబ్నె-కసీ'ర్). 'హదీస్'లో ఉంది: "ఏ విశ్వాసుడైతే, దప్పికగొన్న విశ్వాసునికి నీరు త్రాపుతాడో పునరుత్థాన దినమున అల్లాహ్ (సు.తా.) అతనికి ర'హీఖ్ అల్-మ'ఖ్తూమ్ త్రాపుతాడు మరియు అన్నం పెట్టిన వాడికి స్వర్గపు ఫలాలు తినిపిస్తాడు. మరియు వస్త్రాలు ఇచ్చే వానికి స్వర్గపు వస్త్రాలు ప్రసాదిస్తాడు." (ముస్నద్ అ'హ్మద్, 3/13-14)