[1] నజసున్: అంటే అవిశ్వాసులు, అశుచులు, అశుభ్రులు, అపరిశుద్ధులు, మురికివారు, మాలిన్యులు, కల్మాషులు అనే అర్థాలున్నాయి. ఈ అపరిశుద్ధత శారీరకంగా గానీ, లేక మానసికంగా గానీ, లేక రెండూ గానీ కావచ్చు. శారీరకంగా ఎందుకంటే వారు లైంగిక లేక కాలకృత్యాల అపరిశుద్ధత తరువాత విధిగా పరిశుద్ధత అవలంబించక పోవడం. మానసికంగా, ఎందుకంటే వారు ఏకైక ఆరాధ్యుడు, సర్వసృష్టికర్త, సర్వపోషకుడు అయిన అల్లాహ్ (సు.తా.)ను వదలి ఇతరులను ఏమీ చేయలేని వారిని అల్లాహ్ (సు.తా.)కు సాటి కల్పించడం. ఈ శబ్దం ఖురఆన్ లో ఈ ఆయత్ లోనే ఒకేసారి వచ్చింది. [2] ముస్లిమేతరులు 'హరమ్ సరిహద్దులలోకి రాకూడదు. ఈ ఆజ్ఞ 9వ హిజ్రీలో వచ్చింది. కాని వారు ఇతర మస్జిదులలో ప్రవేశించవచ్చు. ఉదాహరణకు దైవప్రవక్త ('స'అస) స'మామ బిన్ - ఆసాల్ (ర'ది.'అ.)ను అతడు ఇస్లాం స్వీకరించక ముందు మస్జిద్ అన్ నబవీలో ఒక స్థంభానికి ఖైదీగా కట్టి ఉంచారు.