[1] ఎవరైతే బుద్ధిపూర్వకంగా మార్గభ్రష్టత్వాన్ని, కుఫ్ర్ మరియు షిర్క్ ను ఎన్నుకుంటారో! వారికి అల్లాహ్ (సు.తా.) సన్మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేయడు. ఎందుకంటే అల్లాహుతా'ఆలా మానవులకు మరియు జిన్నాతులకు విచక్షణా బుద్ధినిచ్చాడు. ప్రవక్తల ద్వారా మరియు దివ్యగ్రంథాల ద్వారా వారి వద్దకు మార్గదర్శకత్వాన్ని పంపాడు. అయినా వారు తమ తలబిరుసుతనంతో షై'తాన్ వలలో పడిపోయి, షై'తాన్ అడుగుజాడలలో నడుస్తున్నారు. అల్లాహ్ (సు.తా.)కు జరిగిపోయింది, జరగనున్నది అంతా తెలుసు. అల్లాహుతా'ఆలా ఆలిముల్'గైబ్. దుష్టులు సన్మార్గం వైపునకు రారని అల్లాహ్ (సు.తా.) కు తెలుసు కాబట్టి, వారిని మార్గభ్రష్టత్వంలో పడి ఉండనిస్తాడే కానీ, వారిని బలవంతంగా మార్బ్గభ్రష్టత్వంలోకి త్రోయడు.