కాని, ప్రవక్త మరియు అతనితో పాటు విశ్వసించిన వారు తమ సిరిసంపదలతో మరియు తమ ప్రాణాలతో (అల్లాహ్ మార్గంలో) పోరాడారు. మరియు అలాంటి వారికి అన్ని మేళ్ళూ ఉన్నాయి. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు.
మరియు సాకులు చెప్పే ఎడారి వాసులు (బద్దూలు)[1] కూడా వచ్చి వెనుక ఉండి పోవటానికి అనుమతి అడిగారు. మరియు ఈ విధంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు అబద్ధాలు చెప్పిన వారు కూర్చుండి పోయారు. త్వరలో సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష ఉండగలదు.
[1] అల్-అ'అరాబు అంటే, ఎడారి వాసు(బద్దూ)లు. ఈ పదానికి ఇంకా చూడండి, 9:97, 98, 99, 101, 120, 33:20, 48:11, 16 మరియు 49:14.
బలహీనులు మరియు వ్యాధిగ్రస్తులు మరియు ప్రయాణపు ఖర్చులు లేనివారు, ఒకవేళ అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు వాస్తవానికి విశ్వాసపాత్రులై ఉంటే వారిపై (జిహాద్ కు వెళ్ళకుంటే) ఎలాంటి నిందలేదు. సజ్జనులపై కూడా ఎలాంటి నిందలేదు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
మరియు ఎవరైతే నీ వద్దకు వచ్చి వాహనాలు కోరినప్పుడు నీవు వారితో: "నా దగ్గర మీకివ్వటానికి ఏ వాహనం లేదు." అని పలికినప్పుడు, ఖర్చు చేయటానికి తమ దగ్గర ఏమీ లేదు కదా అనే చింతతో కన్నీరు కార్చుతూ తిరిగి పోయారో, అలాంటి వారిపై కూడా ఎలాంటి నింద లేదు.
కాని వాస్తవానికి ధనవంతులై కూడా, వెనుక కూర్చున్న వారితో ఉండటానికి ఇష్టపడి, నిన్ను అనుమతి అడిగే వారిపై తప్పక నింద గలదు. అల్లాహ్ వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాడు, కావున (తాము పోగొట్టుకునేదేమిటో) వారికి తెలియదు.[1]
[1] వీరు ఆయత్ 86, 87లలో పేర్కొనబడ్డ కపటవిశ్వాసులు.