ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించడం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే కొన్ని అనుమానాలే నిశ్చయంగా పాపాలు. మరియు మీరు మీ పరస్పర రహస్యాలను తెలుసుకోవటానికి ప్రయత్నించకండి మరియు చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? మీరు దానిని అసహ్యించుకుంటారు కదా! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.
ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము. మరియు మీరు ఒకరి నొకరు గుర్తించుకోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము.[1] నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.
[1] షు'ఊబున్, ష'అబున్ యొక్క బహువచనం, పెద్ద కుటుంబాన్ని ష'అబ్ అంటారు. దాని తరువాత ఖబీలహ్, 'ఇమారహ్, బ'తన్, ఫ'సీలహ్ మరియు 'అషీరహ్. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
ఎడారి వాసులు (బద్దూలు): "మేము విశ్వసించాము." అని అంటారు. (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "మీరు ఇంకా విశ్వసించలేదు కావున: 'మేము విధేయులం (ముస్లింలం) అయ్యాము.' అని అనండి. ఎందుకంటే విశ్వాసం (ఈమాన్) మీ హృదయాలలోకి ఇంకా ప్రవేశించలేదు. ఒకవేళ మీరు అల్లాహ్ యొక్క మరియు ఆయన ప్రవక్త యొక్క ఆజ్ఞాపాలన చేస్తే, ఆయన మీ కర్మలను ఏ మాత్రం వృథా కానివ్వడు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."
వాస్తవానికి, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించి, ఆ తరువాత ఏ అనుమానానికి లోను కాకుండా, అల్లాహ్ మార్గంలో, తమ సిరిసంపదలతో మరియు ప్రాణాలతో పోరాడుతారో! అలాంటి వారు, వారే! సత్యవంతులు.
వారితో ఇలా అను: "ఏమిటి? మీరు అల్లాహ్ కు మీ ధర్మస్వీకారం గురించి తెలియజేస్తున్నారా? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు."
(ఓ ముహమ్మద్!) వారు ఇస్లాంను స్వీకరించి, నీకు ఉపకారం చేసినట్లు వ్యవహరిస్తున్నారు. వారితో ఇలా అను: "మీరు ఇస్లాంను స్వీకరించి నాకు ఎలాంటి ఉపకారం చేయలేదు! వాస్తవానికి, మీరు సత్యవంతులే అయితే! మీకు విశ్వాసం వైపునకు మార్గదర్శకత్వం చేసి, అల్లాహ్ యే మీకు ఉపకారం చేశాడని తెలుసుకోండి."