[1] దైవప్రవక్త ('స'అస) ప్రస్థానం చేసి మక్కా నుండి మదీనాకు వలస వచ్చినప్పుడు మదీనా చుట్టుప్రాంతాలలో మూడు యూద తెగలవారు ఉండేవారు. 1) బనూ-ఖైనుఖా'అ, 2) బనూ-న'దీర్ మరియు 3) బనూ-ఖురై"జహ్. దైవప్రవక్త ('స'అస) వారందరితో సంధి చేసుకుంటారు. బనూ-ఖైనుఖా'అ తెగవారు తమ దౌర్జన్యాల వల్ల వెడలగొట్టబడతారు. దానికి చూడండి, 59:15 వ్యాఖ్యానం. 2. బనూ-నదీర్' తెగవారు 3వ హిజ్రీలో, ముస్లింలకు ఉ'హుద్ యుద్ధరంగంలో కొంత నష్టం కలిగినందుకు, దైవప్రవక్త ('స'అస) తో తమ సంధిని తెంపుకుంటారు. అతనిని చంపటానికి ప్రయత్నిస్తారు. ముష్రిక్ ఖురైషులతో కలిసి ముస్లింలను పూర్తిగా నిర్మూలించాలని పన్నాగాలు పన్నుతారు. అప్పుడు దైవప్రవక్త ('స'అస) వారితో: 'మాతో యుద్ధం చేయటానికి సిద్ధపడండి లేక మదీనా విడిచి వెళ్ళిపోండి!' అనే రెండు దారులు చూపుతారు. వారు వెళ్ళి పోవటానికి ఒప్పుకొని, పది రోజుల గడువు కోరుతారు. ఈ మధ్య వారు కపటవిశ్వాసుల నాయకుడైన 'అబ్దుల్లా బిన్ ఉబైతో రహస్యసమాలోచనలు చేస్తారు. అతడు వారితో: 'మీరు యుద్ధం చేస్తే మీకు మేము రెండు వేల యుద్ధవీరులతో సహాయం చేస్తాము. కావున మీ కోటలను వదలి వెళ్ళకండి! ఒకవేళ ముస్లింలు మిమ్మల్ని వెడలగొడితే మేము కూడా మీ వెంట వస్తాము!' అని అంటాడు. అప్పుడు ముస్లింలు వారి కోటలను 21 రోజులు చుట్టుముట్టి ఉంచుతారు. 'అబ్దుల్లా ఇబ్నె ఉబై వారికి సహాయపడనందుకు, ముస్లింల అనుమతితో తాము తీసుకోగల సామాగ్రి తీసుకొని వెళ్ళిపోతారు.